UPDATED 19th JULY 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేసిన నెల్సన్ మండేలా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు నెల్సన్ మండేలా అన్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించారన్నారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఆయన ఒకరని, జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారని, మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి ఎంతో స్ఫూర్తినిచ్చినట్లు మండేలా పలు సందర్భాల్లో పేర్కొన్నారన్నారు. వివిధ దేశాలు మండేలాను అనేక అవార్డులు, సత్కారాలతో గౌరవించాయని,1993లో నోబెల్ శాంతి బహుమతి, మనదేశం ఆయనను1990లో భారతరత్న, జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మండేలా చిత్రపటాలు, పోస్టర్లు ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







