UPDATED 24th FEBRUARY 2026 3:10 PM
సమాచారశాఖ అధికారుల్లో మొదలయిన వణుకు!
నిబంధనలు గాలికి.. అనర్హులకు అగ్రపీఠం!
క్షేత్రస్థాయిలో ప్రక్షాళన తప్పదా..?
పైస్థాయి నుంచి సెగ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు
కాకినాడ, రెడ్ బీ న్యూస్, ఫిబ్రవరి 24 : కాకినాడ జిల్లాలో మీడియా అక్రిడేషన్ల జారీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్రిడేషన్ల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO), సమాచారశాఖా మంత్రి దృష్టికి చేరాయి. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రిడేషన్ కార్డులు జారీ చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
అక్రమాలపై అమరావతిలో ఫిర్యాదు..
కాకినాడ జిల్లా సమాచార శాఖాధికారులు నిబంధనలను తుంగలో తొక్కి అనర్హులకు అక్రిడేషన్లు కట్టబెట్టారని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు సమగ్ర ఆధారాలతో కూడిన ఫిర్యాదును రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాచారశాఖా మంత్రి పేషీకి చేరాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కాకుండా అసలు మీడియా రంగంతో సంబంధం లేని వారికి, నిరక్షరాస్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కార్డులు జారీ చెయ్యడానికి జాబితాలు సిద్ధం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
వణుకుతున్న సమాచార శాఖ అధికారులు..
ఈ వ్యవహారం అమరావతిలో సైతం చర్చనీయాంశం కావడంతో కాకినాడ జిల్లా సమాచారశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నతాధికారులు ఏ క్షణమైనా విచారణకు ఆదేశించే అవకాశం ఉండటంతో రికార్డులను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జరిగిన తప్పులపై పైస్థాయిలో వివరణ ఇచ్చుకోలేక అధికారులు సతమతమవుతున్నట్లు సమాచారం.
కలెక్టర్ సీరియస్: ఆధారాలు ఇస్తే చర్యలు తప్పవు..
మరోవైపు ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్పందించారు. అక్రిడిటేషన్ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా వివరాలు సమర్పిస్తే తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే జిల్లాలో అక్రిడేషన్ల జాబితాపై సమగ్ర ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని సమాచారం.







