Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు

UPDATED 30 MARCH 2026 8:00 AM 

పాలనలో వైఫల్యాల పుట్ట.... అక్రమాలకు అడ్డాగా మారిన జిల్లా

స్మార్ట్' సిటీలో చెత్త కుప్పలే సాక్ష్యం!

వేట్లపాలెం నెత్తుటి మడుగు నుంచి.. రేషన్ బియ్యం దందా వరకు.. కలెక్టర్ మౌనం వెనుక మర్మమేమిటి?

​కాకినాడ, రెడ్ బీ న్యూస్, మార్చి 30 : కాకినాడ జిల్లా పరిపాలనా రథసారధిగా ఉండి, వ్యవస్థపై పట్టు సాధించడంలో ఘోరంగా విఫలమైన జిల్లా కలెక్టర్ సకిలి షాన్ మోహన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చివరకు బదిలీ వేటు వేసింది. గత కొంతకాలంగా ఆయన పనితీరుపై వస్తున్న ఆరోపణలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పర్యటనలో బయటపడిన అస్తవ్యస్త పరిస్థితులు కలెక్టర్ బదిలీకి కారణమయ్యాయి. జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సిన అధికారి, కేవలం కొందరు రాజకీయ నాయకులకు, కార్పొరేట్ శక్తులకు 'రబ్బర్ స్టాంపు'గా మారారనే విమర్శలు ఇప్పుడు నిజమయ్యాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను గాలికొదిలేసి, తనదైన ముద్ర వేయలేకపోయిన షాన్ మోహన్‌ను సాగనంపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి ఆగ్రహం.. స్మార్ట్ సిటీలో 'డంపింగ్' దారుణం!

​కాకినాడను స్మార్ట్ సిటీగా మారుస్తున్నామని కాగితాల్లో ఘనంగా చాటుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో బట్టబయలైంది. నగరంలో కొండలా పేరుకుపోయిన చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని చూసి సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు విస్తుపోయారు. "స్మార్ట్ సిటీ అంటే ఇదేనా? అధికారులకు బాధ్యత లేదా?" అంటూ సీఎం బహిరంగంగానే కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్యం వంటి కనీస బాధ్యతలను పర్యవేక్షించడంలో విఫలమైన అధికారి, జిల్లాను ఎలా నడిపిస్తారనే ప్రశ్న అప్పుడే ఉదయించింది. ఆ పర్యటనే కలెక్టర్ బదిలీకి ప్రధాన పునాది వేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వేట్లపాలెం రక్తపాతం.. బాధ్యత ఎవరిది?

​ఇటీవల వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా దుర్ఘటన జిల్లాను కుదిపేసింది. అక్రమ బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా ఉంచడంలో, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడంలో కలెక్టరేట్ యంత్రాంగం పూర్తిగా నిద్రపోయింది. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాత కూడా కలెక్టర్ స్పందించిన తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో కంటే, ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన రాజకీయ నేతలకే ఆయన వత్తాసు పలికారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యుడికి 'నో ఎంట్రీ'.. కార్పొరేట్లకు 'రెడ్ కార్పెట్'!

​కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావాలి. కానీ షాన్ మోహన్ హయాంలో అది కేవలం బడా బాబుల విడిది కేంద్రంగా మారిపోయింది. జిల్లాలో ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ డే  కేవలం ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారింది. సామాన్య ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి గంటల తరబడి వేచి ఉన్నా, కలెక్టర్ కనీసం వారిని పలకరించని సందర్భాలు అనేకం. ​

అక్రమాల పుట్ట.. పారదర్శకత సున్నా!

​జిల్లాలో సాగుతున్న పలు మాఫియాల వెనుక కలెక్టర్ మౌనం ఒక రక్షణ కవచంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ​కొండలను పిండి చేస్తున్నా, అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా మైనింగ్ శాఖను అదుపు చేయడంలో కలెక్టర్ పూర్తిగా విఫలమయ్యారు. పేదల కడుపు కొట్టి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సింది పోయి, చూసీచూడనట్లు వ్యవహరించారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. క్రిందిస్థాయి అధికారులను సమన్వయం చేయడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ​ఒక జిల్లా అధికారిగా వ్యవస్థపై పట్టు సాధించడంలో, ప్రజల నమ్మకాన్ని గెలవడంలో షాన్ మోహన్ పూర్తిగా వెనుకబడ్డారు. అందుకే పాలనలో వేగం పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం, ఇటువంటి 'నిర్లక్ష్యపు' వైఖరిని సహించేది లేదని స్పష్టం చేస్తూ ఆయనపై బదిలీ వేటు వేసింది. ఇది కేవలం ఒక అధికారి బదిలీ మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఏ అధికారికి అయినా ఇదొక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us