UPDATED 23 JANUARY 2022 SUNDAY 09.30 AM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): కరోనా మొదటి రెండు దశలతో పోలిస్తే.. థర్డ్ వేవ్ లో దేశంలో మృతుల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే. మూడో దశలో మృతిచెందినవారిలో 61శాతం మంది టీకాలు తీసుకోనివారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు అని మాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. మరణించినవారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడినవారేనని తెలిపింది. వీరు కూడా కరోనాతోపాటు కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడినవారేనని పేర్కొంది. మూడో దశలో మా ఆసుపత్రుల్లో 82 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 60 శాతం మంది మొదటి డోసు మాత్రమే తీసుకున్నవారు లేదా మొత్తానికే టీకా తీసుకోనివారు' అని మాక్స్ హెల్త్ కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. టీకాలు తీసుకోవడం కారణంగానే మూడో వేవ్ లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు వివరించింది. ఒమిక్రాన్ తీవ్రత, లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు పేర్కొంది. మాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా. సందీప్ బుద్ధిరాజా ఆధ్వర్యంలో.. కరోనా మొదలైనప్పటి నుంచి ఈ జనవరి 20వ తేదీ వరకు సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కొవిడ్ మూడో దశలో 23.4శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారని అధ్యయనం తెలిపింది.అదే రెండో వేలో ప్రాణవాయువు వినియోగం 74శాతంగా, మొదటి దశలో 63 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. ఇందుకు పలు అంశాలను జోడించింది. 'గతేడాది ఏప్రిల్ (సెకండ్ వేవ్)లో దిల్లీలో 28వేల కేసులు నమోదవగా..అన్ని ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. ఐసీయూ పడకలు దొరకడం గగనమైంది. కానీ గత వారం(థర్డ్ మేన్)లో దిల్లీలో దాదాపు అన్నే కేసులు నమోదైనా.. ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య తక్కువే. ఆస్పత్రుల్లో పడకలకు ఎలాంటి కొరత ఏర్పడలేదు' అని అధ్యయనం వివరించింది. మూడు దశల్లో ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య వరుసగా 20888, 12441, 1378 ఉన్నట్లు తెలిపింది.







