UPDATED 10th DECEMBER 2020 THURSDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన మిర్యాల ఆదినారాయణ రిలయన్స్ ఫౌండేషన్ విత్తనోత్పత్తి కార్యక్రమం ద్వారా వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను నాలుగు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతునని, ప్రతీ సంవత్సరం సుమారు రూ. ఐదు వేలు వెచ్చించి నాలుగు ఎకరాలకు సరిపడా విత్తనాలు బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు విత్తనోత్పత్తి కార్యక్రమం గురించి తనకు తెలియచేసి రెండు కేజీలు ఫౌండేషన్ సీడ్ బొండాలు (3626) ఇచ్చారని, వాటిని తన పొలంలో 15 సెంట్లు విస్తీర్ణంలో వేశానని అన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలతో పండించగా ఆరు బస్తాలు దిగుబడి వచ్చిందని తెలిపారు. దాళ్వాకి ఒక బస్తా తన వద్ద ఉంచుకుని మిగిలిన ఐదు బస్తాలను గ్రామంలోని రైతులకు ఒక్కో బస్తా రూ. మూడు వేలు చొప్పున విక్రయించగా రూ.15 వేలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. కేవలం నాలుగు కేజీల ఫౌండేషన్ సీడ్ కు 160 రూపాయలు వెచ్చించగా నాలుగు ఎకరాలకు సరిపడా విత్తనం కొనుగోలు చేసే ఖర్చు మిగిలి పెట్టుబడి కూడా సొమ్ము సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ విత్తనోత్పత్తి కార్యక్రమం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.







