UPDATED 4th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా చదివి విద్యార్థులకు పాఠాలు బోధించాలని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ అన్నారు. మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మి అధ్యక్షతన స్థానిక సీబిఎం సెంటినరీ ఉన్నత పాఠశాలలో విద్యాభోధనా పద్దతులపై ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ చదువు బ్రతుకుతెరువు కోసం వినియోగించరాదని, విద్యార్థులను ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా మారాలని అన్నారు. దీని ద్వారా పాఠశాలలో విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలతో పాటు నోట్స్ రాసే విధంగా చూడాలని, అలాగే హోం వర్కు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులకు వ్యక్తిగత క్రమశిక్షణ అవసరమని, ఖాళీ సమయాల్లో తప్ప తరగతి గదిలో సెల్ ఫోన్ వినియోగించరాదని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు ఒక పదాన్ని ఒకసారి మాత్రమే డిక్టేషన్ చెప్పాలని, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్, లెక్కలతో పాటు అన్ని సబ్జెక్టులు విద్యార్థులు చదివే విధానం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలో పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







