Updated 4th December 2022 5:10 pm
Engineer sisters : ఆ ఇద్దరు అమ్మాయిలు కవలలు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. చివరకు పెళ్లి కూడా తమను విడదీయకూడదని భావించారో ఏమో.. ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెళ్లి పందిరిలో వరుడికి ఒకే పూలదండ వేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… పింకీ, రింకీ అనే అక్కాచెల్లెళ్లు ముంబైలోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
వారు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లుజ్ లో ఉంటారు. కొన్ని వారాల క్రితం పింకీ, రింకీ తండ్రి మృతి చెందాడు. పింకీ, రింకీ ఇంటికి దగ్గరలోనే అటల్ అనే యువకుడు ఉండేవాడు. పింకీ, రింకీ తల్లి ఆరోగ్యం బాగోలేనప్పుడు కారులో వారిని ఆ యుకుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆ యువకుడితో పింకీ, రింకీకి స్నేహం చిగురించింది. అది ప్రేమగా విరబూసింది.
ఇద్దరమూ ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకుంటామని పింకీ, రింకీ తమ పెద్ద వాళ్లకు చెప్పారు. దీంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. అటల్ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. తాజాగా, పింకీ, రింకీకి అటల్ తాళి కట్టాడు. అనంతరం వరుడి మెడలో పూలదండ వేసే కార్యక్రమం జరిగింది. వరుడిని కొందరు ఎత్తుకున్నారు.
అతడి మెడలో వధువులు పూలదండ వేయాల్సి ఉంది. పింకీ, రింకీ కలిసి వరుడి మెడలో పూలదండ వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు పింకీని ఒకరు ఎత్తుకోవడంతో వరుడి మెడలో పూలదండ పడింది. ఒకే యువకుడిని ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.







