జిల్లాలో ప్రతీ ఇంటికీ త్రాగునీటి కుళాయిలు

UPDATED 2nd JANUARY 2019 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం: జిల్లాలో ప్రతీ ఇంటికీ త్రాగునీరు కుళాయిలు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మండలం తూర్పుపాకలు, మర్లావ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఆరవ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన గ్రామసభల్లో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో రూ.1000 కోట్లు మంజూరు చేయించి ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు మంజూరు చేయిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పనలో భాగంగా అవసరమైన చోట్ల రహదారులు, సామాజిక  భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కోసం సుమారు రూ.లక్ష కోట్లు బడ్జెట్ లో కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. రైతులకు రుణమాఫీ ద్వారా రూ.24 వేల కోట్లు రూపాయలు అందించడం జరిగిందని, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన పేదవారి వివాహం నిమిత్తం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు అక్కడ ఉచితంగా వైద్యపరీక్షలు, మందులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం వహించకుండా తగు చర్యలు తీసుకుని సకాలంలో అర్హులందరికీ రుణాలు మంజూరు చేసే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో మెట్టప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు అందించడంతో పాటు విశాఖపట్నం జిల్లాకు త్రాగునీరు అందించగలుగుతున్నామని అన్నారు. మర్లావ గ్రామంలో కాలువకు వంతెన నిర్మాణానికి జనవరి 18వ తేదీన శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అలాగే మర్లావ నుంచి పెద్దాపురం వచ్చే రహదారిని కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా తూర్పుపాకలు గ్రామంలో నీరు-చెట్టు పథకం క్రింద రూ.49 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం తూర్పుపాకలు, మర్లావ గ్రామాల్లో చంద్రన్న సంక్రాంతి కానుకలు మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, ఎంపిడివో పి. వసంతమాధవి, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us