UPDATED 11th FEBRUARY 2022 FRIDAY 00:50 AM
రథసప్తమి నాడు పెళ్లి కుమారుడుగా దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు శుక్రవారం ఉభయ దేవేరులను పరిణయమాడేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణయ వేడుకలు పది రోజుల పాటు జరుగుతుండగా, మృగశిర నక్షత్రయుక్త వృశ్చికలగ్నమందు శుక్రవారం రాత్రి 12.35 గంటలకు కల్యాణం జరుగనుంది.
కల్యాణ తంతు జరిగేదిలా..
అంతర్వేది (రెడ్ బీ న్యూస్): కల్యాణకాంతులతో మెరుస్తున్న మేఘ వర్ణుడు స్వామివారు కల్యాణానికి సిద్ధపడుతూ తొలుత కంచుగరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి పెండ్లి కుమారుడి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త మొగల్తూరు రాజవంశీ యు లు, ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ రామగోపాల రాజాబహద్దూర్, పెండ్లి కుమార్తె తరపున అర్చకస్వాములు రాజా వారి వీధిలో ఎదురు సన్నాహాలు (ఒకరికొకరు బుక్కా చల్లుకోవడం) చేస్తారు. అనంతరం శ్రీ వారి ఆలయం వద్దకు చేరుకుంటారు. తర్వాత స్వామివారు మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కల్యాణమండపం వద్దకు చేరుకుని సింహాసనంపై ఆశీనులవుతారు. ఆలయ స్థానాచార్యులు రంగాచార్యులు సమక్షంలో ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్ కల్యాణతంతును నిర్వహిస్తారు. తొలుత రక్షాబంధనం, తర్వాత పవిత్రమైన దర్పలతో (కూర్చ) గోవుగా భావించి గోదాన మంత్రాలతో గోదానం నిర్వహిస్తారు. మాఘమాసం మృగశిర నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నమందు శుక్రవారం రాత్రి 12.35 గంటలకు శ్రీస్వామివారు, అమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర, బెల్లం అర్చక స్వాములు చేత సమర్పిస్తారు. కన్యాదానంలో భాగంగా కొబ్బరిబొండం, గుమ్మడికా య, గంధపుచెక్క, అరటిపండ్లు, శ్రీభూదేవిలను స్వామివారికి దానం చేస్తారు. శ్రీస్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతధారణ, శ్రీ, భూదేవిలకు మంగళసూత్ర ధారణ నిర్వహిస్తారు. ఇక పొలమూరి రాజుల సత్రం నిర్వాహకులు అందించిన మంచి ముత్యాల తలంబ్రాలను అర్చకస్వా ములు, స్థానాచార్యులు, మొగల్తూరు రాజావారు, పొలమూరి రాజు లు సమర్పిస్తారు. అర్చక స్వాములచే స్వామి, అమ్మవార్లకు చెమ్కి దండలు, పూల దండలు సమర్పిస్తారు. అనంతరం మంగళహారతి ఇస్తారు. కల్యాణోత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు ఇచ్చిన దాతలు డాక్టర్ పోతురాజు సూర్యవెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులు సమర్పించిన ఆభరణాలతో కల్యాణ వైభోగం జరుగుతుంది.
సామాన్య భక్తులకు తీవ్ర అన్యాయం..
రాష్ట్రంలోనే ఆరుబయట నిర్వహించే కల్యాణోత్సవాల్లో అంతర్వేది నర్సన్న కల్యాణం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈసారి అనాదిగా వస్తున్న కల్యాణ సంప్రదాయాలను తుంగలోకి తొక్కే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏటా 3 వేల మంది భక్తులకిచ్చే కల్యాణం టిక్కెట్లు వెయ్యికే పరిమితం చేశారు. అది కూడా దాతలు, పొలమూరి సత్రం, అధికారులు, ఉత్సవ కమిటీ పేర్లతోనే పాస్‌లు కేటాయిస్తున్నారు. ఇక ఎన్నడూలేనివిధంగా మండపానికి ఆనుకుని వీఐపీల కార్లు వెళ్లే మార్గాన్ని, భారీ లైటింగ్ సామగ్రి ఏర్పాటుచేసి భక్తులు కల్యాణాన్ని తిలకించకుండా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







