UPDATED 23rd JULY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని సామర్లకోట తహసీల్దార్ వజ్రపు జితేంద్ర రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సామర్లకోట పట్టణ, మండల పరిధిలో గల విఆర్వోలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్. శ్రీనివాసరావు, విఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







