* బొడ్డు లేఖతో చర్చనీయాంశంగా మారిన పెద్దాపురం రాజకీయాలు
* బొడ్డు వెర్సస్ రాజప్ప
* పార్టీ సీనియర్ల ముందే బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్
UPDATED 14th MAY 2018 MONDAY 11:00 AM
పెద్దాపురం (రెడ్ బి న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో పార్టీ వ్యవహారాల్లో మరో సమస్య తెరమీదకు వచ్చినట్లయ్యింది. గత కొన్ని రోజులుగా పెద్దాపురం నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న ఈ వ్యవహారం బొడ్డు విడుదల చేసిన లేఖతో ముదిరి పాకానపడింది. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చినరాజప్పతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరు ఇరువురు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాను స్థానికుడుని కావడం తనకు ప్లస్ పాయింట్ గా బొడ్డు భావిస్తున్నారు. రాజప్పని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్లు అయిన యనమల, జ్యోతుల నెహ్రూల ముందు వ్యహారం తేల్చుకుందామని బొడ్డు భావిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్న వారితో పెద్దాపురంలో రాజప్పకి తమ సత్తా చూపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో జరిగిన చర్చలో చినరాజప్ప మాట్లాడిన మాటలపై జిల్లావ్యాప్తంగా కొన్ని రాజకీయవర్గాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో బహిరంగలేఖతో బొడ్డు భాస్కర రామారావు నేరుగా హోంమంత్రికి సవాల్ చేశారు. దీంతో పెద్దాపురం రాజకీయాల్లో ఆదో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పెద్దాపురంలో చినరాజప్ప కన్నా బొడ్డు సీనియర్. గతంలో ఆయన రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో కోనసీమ ప్రాంతం నుంచి వచ్చిన రాజప్ప టికెట్ దక్కించుకుని విజయం సాధించి, ఏకంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి తదితర పదవులు దక్కించుకున్నారు. అప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా ఆయన మళ్లీ పెద్దాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నారు. పెద్దాపురంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు వైసిపిలో చేరిన బొడ్డు, ఆ తర్వాత టిడిపిలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకే పెద్దాపురం టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కార్యకర్తలను,అభిమానులను అందరిని కలుస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దాపురంలో ప్రజలకు మంత్రి అందుబాటులో ఉండకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకత్వం పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇది తనకు కలిసొచ్చే అంశంగా బొడ్డు వర్గీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బొడ్డు వేగంగా అడుగులు వేస్తున్నారు. వీరి ఇద్దరి వ్యవహారం ప్రస్తుతం తూర్పులో హాట్ టాపిక్ గా మారింది.







