UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 10:00 PM
రాజానగరం: కృషి, పట్టుదలతో లక్ష్య సాధనకు కృషి చేయాలని లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి చైర్ పర్సన్ కె. నాగమణి అన్నారు. స్థానిక లెనోరా దంత వైద్య కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహించే జాతీయస్థాయి పెరియోతరంగ్ కన్వెన్షన్-2018 శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి ఆలోచనలు ఉన్నవారు ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని, ఈ పనిచేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రయత్నం చేయందే ఏదీ సాధ్యం కాదని, మంచి నడవడికతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారన్నారు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దాన్ని గుర్తించి ఎంచుకున్న రంగంలో కష్టించి పనిచేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. అనంతరం దంతవైద్యంలో వచ్చిన వివిధ రకాల ఆధునిక ప్రక్రియలు గురించి అతిథులు ప్రసంగించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆర్ఎక్స్ 100 సినీ హీరో కార్తికేయ కళాశాలలో హల్ చల్ చేశారు. సినిమాలోని వివిధ పాటలకు స్టెప్పులు వేసి యువతను హుషారెక్కించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ పెరియోడాంటాలజీ అధ్యక్షుడు డాక్టర్ నితిన్, డాక్టర్ రజనీష్ రెడ్డి, సదస్సు చైర్మన్ డాక్టర్ రమేష్ అమిరిశెట్టి, కార్యదర్శి డాక్టర్ రూపశ్రీ గుండాల, కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







