* పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు
UPDATED 19th JULY 2020 SUNDAY 5:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్న దృష్ట్యా అత్యవసరమైతే ఐసోలేషన్ సెంటర్‌కు తరలించాలని, లేదంటే హోం క్వారంటైన్ లోనే ఉంచాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అధికారులను ఆదేశించారు. పెద్దాపురం మండలం కాండ్రకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కోవిడ్ వైద్య పరీక్షలను ఆయన పరిశీలించారు. తొలుత కోవిడ్-19 పరీక్షల నిర్వహణ తీరుపై ఆర్డీవో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ అనూషను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా హోం క్వారంటైన్ లో ఉన్న వారి ఇంటికే కరోనా కిట్లును అందచేసే ఏర్పాట్లు చేశామన్నారు. హోం క్వారంటైన్లలో ఉన్న వారందరికీ కిట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని, 20వ తేదీ నుంచి కరోనా బాధితులకు కోసం ఎంపీడీవో కార్యాలయం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా మహామ్మారి బారిన పడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, . మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తరచూ శానిటైజర్లును వినియోగించాలని అన్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, మిగతా సమయాల్లో ఇంట్లోనే ఉండాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న కారణంగా పెద్దాపురం పట్టణ, రూరల్ ప్రాంతంలో 144 సెక్షన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే మాత్రమే దుకాణాలు తెరచి ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు నెగిటివ్ వచ్చినా సరే బయటకు రాకుండా చూడాలని, లేదంటే వారికి మళ్ళీ పాజిటీవ్ నిర్ధారణ అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఈ విషయంలో అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో కంటైన్మెంట్ జోన్లను ఆయన పరిశీలించారు. ఆర్డీవో వెంట ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.







