UPDATED 28th JANUARY 2019 MONDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం డివిజనుకు సంబంధించిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ మోనటరింగ్ కమిటీ సమావేశం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో గత మోనటరింగ్ కమిటీ సమావేశంలో పేర్కొన్న 17 కేసులకు సంబంధించి తహసీల్దార్లతో చర్చించారు. కోటనందూరు మండలం పి.కొట్టాం, కె.కొట్టాంకు సంబంధించిన స్మశాన ఆక్రమణలు, ఎస్సీ కార్పోరేషనుకు సంబంధించి భూముల పట్టాదారు పాసుపుస్తకాలు, అలాగే తుని మండలం ఎస్.టి.నగరం, ఎన్.ఆర్ భూమి, పెద్దాపురం మండలం ఆనూరులో భూపట్టా, కిర్లంపూడి మండలంలో భూదాన బోర్డుల భూములు, గండేపల్లి మండలం ఎల్.సి.సి.భూములు, రావికంపాడు స్మశానఆక్రమణ, ఏలేశ్వరం మండలం 153 మంది పట్టాలు, డి.ఎన్.ఎ టెస్ట్ తదితర కేసులపై తీసుకున్న చర్యలపై ఆర్డీవో సమీక్షించి, త్వరలోనే వీటిని పరిష్కరించి నివేదికను అందచేయాలని ఆదేశించారు. పెద్దాపురం డివిజనులో ఇప్పటి వరకు 141 కేసులకుగాను 81 కేసులు పరిష్కరించామని, 23 కేసులు ఎస్సీ, ఎస్టీకి సంబంధించినవి కానందున తిరస్కరించామని, 36 కేసులను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరిగిందని, ఒక కేసు పెండింగులో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఏవో నాంచారయ్య, జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు, రంగంపేట తహసీల్దార్లు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పిల్లి బలరాముడు, తదితరులు పాల్గొన్నారు.







