UPDATED 8th DECEMBER 2018 SATURDAY 8:00 PM
రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల జిల్లాస్థాయి స్పోర్ట్స్& గేమ్స్-2018 ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జి. రామానుజం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మూడురోజుల పాటు ఈ క్రీడాపోటీలు జరుగుతాయని, జిల్లా పరిధిలో గల సుమారు 30 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 850 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, ఇందులో 600 మంది బాలురు, 250 మంది బాలికలు ఉంటారని తెలిపారు. బాల, బాలికలకు వాలీబాల్, బాడ్మింటన్, చెస్, అథ్లెటిక్స్ తదితర క్రీడలతో పాటు బాలురకు కబడ్డీ, బాలికలకు ఖో-ఖో లలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలకు నోడల్ అధికారిగా ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల (కాకినాడ) ప్రిన్సిపాల్ కె.ఎస్. ప్రసాదరావు వ్యవహరిస్తారని రామానుజం పేర్కొన్నారు.







