UPDATED 1st NOVEMBER 2018 THURSDAY 11:30 AM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 25 నుంచి 28 వరకు విజయవాడలోని బెంజిసర్కిల్ వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తమ కళాశాలలో నాల్గవ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ చదువుచున్న అనూష్ బాబు విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని, మొత్తం 250కేజీల బరువు ఎత్తి జూనియర్, సీనియర్ విభాగాలలో ఛాంపియన్ గా నిలిచాడని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి కళాశాల పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఛాంపియన్ గా నిలిచిన అనూష్ బాబు మాట్లాడుతూ తనది ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబమని, తన తండ్రి వ్యవసాయ కూలీ అని, తనలో గల ప్రతిభను గుర్తించి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, గురువు వి. సతీష్ కుమార్ ప్రోత్సాహంతో నేడు ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. రవికిషోర్, ఆదిత్య క్యాంపస్ కోచ్ అరవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.







