న్యాయవాదులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి

* భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు    

UPDATED 5th JULY 2020 SUNDAY 5:00 PM

రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్ చేశారు. భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 6వ తేదీన రాష్ట్రంలోని న్యాయవాదులు కోవిడ్ నిబంధనలకు లోబడి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర బడ్జెట్ లో న్యాయవాదుల సంక్షేమానికి రూ. వంద కోట్లు కేటాయించామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ లో న్యాయవాదులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని, నవరత్నాలులో ప్రకటించిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. వంద కోట్లు విడుదల చేసి న్యాయవాదులను ఆదుకోవాలని అన్నారు. వైయస్ఆర్ లానేస్తం పేరుతో జూనియర్ న్యాయవాదులకు ఇస్తామన్న స్టయిఫండ్ గత నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా  ప్రభుత్వానికి ఏమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జూనియర్ న్యాయవాదుల ఇవ్వాల్సిన నాలుగు నెలల స్టయిఫండ్ ను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. బార్ కౌన్సిల్ లో నమోదైన వెంటనే జూనియర్ న్యాయవాదులు స్టయిఫండ్ కోసం నిరంతరం దరఖాస్తు చేసుకునేలా మార్పులు తీసుకురావాలని తెలిపారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకి బార్ కౌన్సిల్ ఇచ్చే నాలుగు లక్షల రూపాయలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ గా మరో నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గత జీవో ప్రకారం ఇవ్వడానికి అంగీకరించి ప్రస్తుతానికి కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి చాలా కాలమైనా ఇంతవరకూ ఒక్క పైసా కూడా మ్యాచింగ్ గ్రాంట్ రూపేనా విడుదల చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100 కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ సందర్భంగా న్యాయవాదులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అదనంగా మరో పాతిక కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న న్యాయ వాదులకు ఇచ్చేందుకు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అలాగే న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ తమ నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us