UPDATED 8th MAY 2019 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న కూలీల కొరతను దృష్టిలో ఉంచుకుని రైతుల ప్రయోజనార్ధం పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వాక్యూమ్ సీడర్ అనే యంత్రాన్ని రూపొందించారు. కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎ. డానియల్, టి. విజయ్ చౌదరి, కె. కళ్యాణి, ఆర్.వి. సుధాకర్, డి. సత్యనారాయణ వినూత్నంగా ఆలోచించి తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయం పనిచేసే విధంగా ఈ యంత్రాన్ని రూపొందించారు. సాధారణంగా నర్సరీలలో పూలు, పండ్లు, కూరగాయల కోసం సీడింగ్ ట్రేలలో విత్తనాలను నారుగా పోస్తారని, ఒక మనిషి ఒక ట్రే నింపడానికి రెండు నిముషాలు పడుతుందని, ఈ వాక్యూమ్ సీడర్ ను ఉపయోగించి కేవలం 30 సెకన్లలో ఒక ట్రే నింపవచ్చని విద్యార్థులు పేర్కొన్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాధిపతి టి. ప్రభాకరరావు ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గైడ్ గా డి. సుందర్ వ్యవహరించగా మెకానికల్ సూపర్ వైజర్ వి.టి.ఆర్.ఎల్. చౌదరి నిర్మాణ సహకారం అందించారు. ఈ యంత్రం నిర్మాణానికి 1200 వోల్ట్స్ పవర్ గల వాక్యూమ్ మిషన్, వివిధ సైజుల ప్లాస్టిక్ పైపులు, అల్యూమినియం, ప్లే ఉడ్ సహాయంతో ఇనప ఫ్రేములు ఉపయోగించి కేవలం రూ.15 వేలు ఖర్చుతో రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఇ. సర్వ రామేశ్వరుడు, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో ఎన్. జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, తదితరులు విద్యార్థులను అభినందించారు.







