రత్నగిరికి ఉచిత బస్సు సర్వీసులు

* ఈనెల 14 నుంచి 19 వరకు సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు
* భద్రత, తదితర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

UPDATED 2nd MAY 2019 THURSDAY 9:00 PM

అన్నవరం: ఈనెల 15వ తేదీన జరగనున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం రోజున కొండ దిగువ నుంచి రత్నగిరిపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి  ఎం. సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం పెద్దాపురం ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి. వసంత రాయుడు, డిఎస్పీ చిలకా వెంకట రామారావు, స్థానిక పోలీస్, రెవిన్యూ, దేవస్థానం అధికారులతో కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి చేపడుతున్న ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవానికి  హాజరయ్యే భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులతో పాటు కొండపై వివాహాలతో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందు జాగ్రత్తగా కల్యాణోత్సవం రోజున కొండపైకి ఆటో వాహనాలను అనుమతించరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీన దేవస్థానం బస్సులతో పాటు, అదనపు బస్సులతో కలుపుకుని 15 బస్సులను భక్తులను కొండపైకి తీసుకురావడానికి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు పార్కింగ్ స్థలాలు ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కొండపై ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాలతో పాటు అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూములో సిసి కెమెరాల లైవ్ ను అనుసంధానం చేసి పోలీసు, దేవస్థానం సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించడానికి నిర్ణయించారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన హ్యాండ్ మైకులను పోలీసులకు దేవస్థానం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి కల్యాణోత్సవం రోజున  కొండపైకి ఆటోల నిషేధంపై తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. దివ్యాంగులైన భక్తులకు వీల్ చైర్లను ఏర్పాటు చేస్తామని, కొండపైన, కొండకింద శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లుపై కూడా సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు.  కల్యాణ మహోత్సవం సందర్భంగా వివిధ శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయంతో నిర్వహిస్తున్న పనులను ఈనెల 10వ తేదీ లోగా పూర్తి చేసి ట్రయిల్ రన్ ను చేపట్టాలని  నిర్ణయించారు. అనంతరం వాహనాలు పార్కింగ్ స్థలాలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఈరంకి జగన్నాధరావు, ఈఈ శేఖర్, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 
    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us