UPDATED 5th DECEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): బొండాలు రకం వరి విత్తనాలను రైతులు సాగు చేయవద్దని కాకినాడ వ్యవసాయ శాఖ ఎడి జి.వి. పద్మశ్రీ పేర్కొన్నారు. సామర్లకోట సొసైటీలో రైతులకు 5 శాతం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీని ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడిఏ పద్మశ్రీ మాట్లాడుతూ బొండాలు వరి విత్తనాలకు బదులుగా ఎంటిబి 1121 రకం వరి విత్తనాలు సాగు చేసుకోవాలని, బొండాలు రకం సాగు చేస్తే ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే వాటికి పంట నష్టం రాదని, ఈ రకానికి బదులు ఎంటివి 1121 రకం సాగు చేయడం వల్ల 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటు అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుని గింజ రాలడం జరగదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య, ఏఈవో ఎం.వి. సతీష్, విఎఎ కె. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







