UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 6:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , గైట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గైట్ ప్రాంగణంలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి గైట్ అటానమస్, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గైట్ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.వి. ప్రసాద్, డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, డాక్టర్ పి.జి. రామానుజం, డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, ప్రొఫెసర్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆదర్శప్రాయుడు అయిన మోక్షగుండం సేవలు నేటి యువ ఇంజినీర్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో విశ్వేశ్వరయ్య పాత్ర ఎంతో కీలకమని, అందుకే ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటామన్నారు. గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యలోని అకుంఠిత సేవాదృక్పధం స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అనంతరం ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాల్స్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. మూర్తి, డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







