UPDATED 18th JULY 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: రేషన్ డీలర్లకు సరఫరా చేసే రేషన్ సరుకులలో నాణ్యత లోపిస్తే ఆ సరుకులను పంపిణీ చేయరాదని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు డీలర్లను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సివిల్ సప్లైస్ అధికారులు, రేషన్ డీలర్లు, డిప్యూటీ తహశీల్దార్లతో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ రేషన్ సరుకులలో నాణ్యత లోపిస్తే తిరిగి ఎం.ఎల్.ఎస్ పాయింట్ పంపాలని, కార్డుదారులకు పంపిణీ చేయరాదని, ప్రతీ రేషన్ డీలరు ప్రతీ నెలా 20వ తేదీ నాటికి రేషన్ సరుకులకు సంబంధించిన డిడిలను సంబంధిత తహసీల్దార్లకు అందచేయాలన్నారు. ప్రతీ రేషన్ కార్డుదారునికి నెలాఖరు వరకు రేషన్ సరుకులు అందచేయాలని, రేషన్ షాపులలో ఆహార సరుకుల పట్టిక ప్రదర్శించాలని, ప్రతీ సరుకులకు రశీదు ఇవ్వాలన్నారు. వేలిముద్ర సమస్య వస్తే 1100కు డీలరే ఫోన్ చేసి సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మీసేవ ద్వారా వచ్చే సర్టిఫికెట్లును ఎలాంటి జాప్యం లేకుండా జారీచేయాలని, పెండింగులో ఉన్న నీటితీరువా బకాయిలు వసూలు చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీలు ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని, ఎల్ఇసి కార్డులు రెన్యూవల్, కొత్తవి, పెండింగులో ఉన్నవి జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.వో పురుషోత్తమ కుమార్, ఎం.ఎస్.వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.







