* సార్వా పంటకు పుష్కలంగా నీరు
* ఇరిగేషన్ ఎస్ఈ సూర్యప్రకాశరావు
UPDATED 10th JUNE 2020 WEDNESDAY 6:00 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): వేసవి కాలం అనంతరం కాలువలకు నీటిని విడుదల చేసే ప్రక్రియలో భాగంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం ఈస్ట్రన్ డెల్టా కాలువకు, బొబ్బర్లంక సెంట్రల్ డెల్టా కాలువకు గేట్లను ఎత్తి ఇరిగేషన్ ఎస్ఈ సూర్య ప్రకాశరావు బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ సూర్య ప్రకాశరావు మీడియాతో మాట్లాడుతూ సార్వా పంటకు నీటి కొరత లేకుండా గోదావరి నీరు పుష్కలంగా ఉంటుందని, ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు సంబంధించిన 4 లక్షల 83 ఎకరాలకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని మొదటగా విడుదల చేయడం జరిగిందని అన్నారు. అవసరానికి అనుగుణంగా మళ్లీ నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఈఈ మోహన్ రావు మాట్లాడుతూ బ్యారేజ్ కింద ఆయకట్టుకు 12000 క్యూసెక్కులు నీరు అవసరం ఉందని, ఎనిమిది వేలు మాత్రమే నిల్వ ఉండగా ప్రస్తుతం 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు, రానున్న జూలై 15, ఆగస్టు 15 మధ్యన గోదావరి వరద ఉంటుందని, దీనివలన నీటి కొరత ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈలు ప్రదీప్ కుమార్, పోఖారావు, ఏఈలు సాయిరాం, సాయికుమార్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







