UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 03:00 PM
★ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నిర్వాహకులు
★ గుండాట నిర్వహించుకునేందుకు ముందస్తు సెటిల్‌మెంట్లు
★ చక్రం తిప్పుతున్న కొందరు కానిస్టేబుళ్లు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : మహాశివరాత్రి ఉత్సవాల ముసుగులో జూదక్రీడలు నిర్వహించేందుకు గుండాట నిర్వాహకులు ముందస్తుగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.
గ్రామాల్లో గుండాటలను రహస్యంగా పంట పొలాల్లో మూడు రోజులపాటు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తమకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు పోలీసులను ప్రసన్నం చేసుకునేందుకు జూదాల నిర్వాహకులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జూదాలు నిర్వహించుకునేందుకు రూ.లక్షల్లో పోలీసులకు ముట్టచెప్పేందుకు సదరు నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు సమాచారం. జూదాలు నిర్వహణకు సంబంధించి నిర్వాహకులతో చేతులు కలిపిన కొందరు కానిస్టేబుళ్లు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం .. స్టేషనుకు ముందుగా సెటిల్ చెయ్యాలని నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
మేము చెప్పినట్లు చేస్తే మీకు ఇబ్బందులు ఉండవని, అధికారులతో మేము మాట్లాడి మీకు ఏ సమస్యా లేకుండా చూస్తామని నిర్వాహకులకు కానిస్టేబుళ్లు అభయం ఇస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని యువతను జూదాలవైపు వెళ్లకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.







