* జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర
* నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
UPDATED 27th MARCH 2019 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: అందరికీ అందుబాటులో ఉంటా..నన్ను ఆదరించండి అంటూ జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర పెద్దాపురం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. ముందుగా పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రచారం ప్రారంభించారు. పట్టణంలో వార్డుల్లో తిరుగుతూ జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే దివ్యాంగులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను స్థానికుడినని, తన బలమే స్థానికత అన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి అయిన తాను గెలిచిన వెంటనే నియోజకవర్గ పరిధిలో గల సామర్లకోట పట్టణంలో రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. చెరుకు లారీలు, ట్రాక్టర్లు సామర్లకోట పట్టణం మీదుగా వెళ్లకుండా నేరుగా ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణం, సామర్లకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల, అలాగే ప్రభుత్వ నర్సింగ్, బీఈడీ కళాశాలల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో తన గుర్తు గాజులపై వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి దొరబాబు, కె. అబ్బాస్, సత్యశ్రీ, బాబి, వై. నాగబాబు, నాగభాస్కరం, లోకేశ్వరి ఆధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







