ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

* ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
* 108,104 వాహనాలను ప్రారంభించిన మంత్రులు

UPDATED 2nd JULY 2020 THURSDAY 8:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక రంగరాయ వైద్య కళాశాల వద్ద జిల్లాకు చేరిన 108,104 వాహనాలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. 108, 104 వాహనాలలో సేవలందించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఆ సమస్యలు జిల్లాస్థాయి అధికారులు, పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే దాని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున 108, 104 వాహనాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని, కరోనా వంటి కష్టకాలంలో పల్లె పల్లెకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరేలా 108, 104 వాహనాలు జిల్లా ప్రజలకు ఆపద సమయంలో ఎంతో తోడ్పాటును అందిస్తాయని ఆయన అన్నారు. జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 108, 104 వాహనాలు తీసుకురావడం శుభ పరిణామమని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇది ఒక ప్రధానమైన ఘట్టమని ఆయన తెలిపారు. జిల్లాకు సంబంధించి 108 వాహనాలు 39, 104 వాహనాలు 63 జిల్లాకు చేరాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో , గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని ఈ వాహనాల ద్వారా సేవలందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా అప్పుడే పుట్టిన బిడ్డలు  కోసం ప్రమాద సమయాలలో సేవల నిమిత్తం అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు నియోనేటల్ ఆంబులెన్స్ లు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ వాహనాలు కాకినాడ, రంపచోడవరంలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, అమలాపురం పార్లమెంటు సభ్యులు వంగా గీత, చింతా అనురాధ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారి, డియంహెచ్ఓ డాక్టర్ యం. మల్లిఖార్జున్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యం. రాఘవేంద్రరావు, ఆర్.యం.సి. ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జి, అడిషనల్ యస్పీ కరణం కుమార్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దిన్కర్ పుడ్కర్, 108, 104 ఆపరేషన్స్ జిల్లా మేనేజర్ సిహెచ్.అవినాష్, మెయింటెనెన్స్ జిల్లా ప్రతినిధి ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us