UPDATED 9th MAY 2019 THURSDAY 9:00 PM
పెద్దాపురం: వైశాఖ శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకొని జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పెద్దాపురం పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హరిశంకరాచార్య వేద శాస్త్ర ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చిట్టెం హరిగోపాలశర్మ ఆధ్వర్యంలో స్థానిక మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఆది శంకరాచార్యులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు హరిగోపాలశర్మ మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ వేద విద్య, వైదిక ధర్మం నిలిచి ఉండడానికి కారణం అది శంకరాచార్యులేనని, ఆయన చూపిన అద్వైత మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి తమ్మన శ్రీనివాసరావు, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







