పెద్దాపురంలో ఆశీలు వసూళ్ల దందా: చిరువ్యాపారులపై కాంట్రాక్టర్ల జులుం!

UPDATED 27th APRIL 2027 12:30 PM

​పెద్దాపురం: పట్టణంలో మున్సిపల్ ఆశీలు వసూళ్ల పేరుతో కాంట్రాక్టర్లు సాగిస్తున్న అక్రమాలు హద్దులు దాటుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి సామాన్య చిరువ్యాపారులను దోచుకుంటున్నారంటూ 'ఫర్ ది పీపుల్' ఫౌండేషన్ చైర్మన్ గుణ్ణం లక్ష్మణరావు సోమవారం రెవిన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించిన ధరల ప్రకారం తోపుడు బండ్ల వ్యాపారుల నుండి కేవలం రూ. 7 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా రూ. 30 నుండి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు రంగుల్లో ముద్రించిన అధికారిక రశీదులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఎటువంటి రశీదులు లేకుండానే ఈ వసూళ్లు సాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టణంలోని ఏ సెంటర్‌లోనూ మార్కెట్ ధరల పట్టికను ప్రదర్శించకపోవడం కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ దోపిడీపై గతంలో మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us