ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్

UPDATED 28th NOVEMBER 2018 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందచేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. స్థానిక సుధాకాలనీలో రూ.కోటి 52 లక్షలతో నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మంత్రి కళావెంకట్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్  సరఫరా చేస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా హోంమంత్రి చొరవతో డిమాండును బట్టి సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని, వీటికి సపోర్టు మెటీరియల్ కూడా సరఫరా చేస్తున్నామని అన్నారు.  దేశంలో వినియోగించే విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్ 12 శాతం అధికంగా వినియోగించుకుంటున్నారని దీనికి రాష్ట్ర అభివృద్దే కారణమని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూ.660 కోట్లు నష్టం ఉంటే ప్రస్తుతం రూ.360 కోట్లు ఉందని తెలిపారు. దేశం మొత్తం మీద 18 శాతం ఉత్పత్తి వ్యయం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు వల్ల రాష్ట్రంలో 9.2 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం వల్ల దేశంలో మన రాష్ట్రం 10.5 శాతం అభివృద్ధిలో ఉందని అన్నారు. దేశంలో అభివృద్ధి 7శాతం ఉండగా గుజరాత్ కంటే ముందు మన రాష్ట్రం ఉందని చెప్పారు. అనంతరం సబ్ స్టేషన్ ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం పాండవులమెట్టపై ఉన్న శతాబ్ధి పార్కును మంత్రులు జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రాతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, ఎలక్ట్రికల్ ఎస్.ఇ సిహెచ్. సత్యనారాయణరెడ్డి, గుడా డైరెక్టర్  ఎలిశెట్టి నాని, వార్డు కౌన్సిలర్ కందుల ఝాన్సీలక్ష్మి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, డిఇ ఎన్. ఉదయభాస్కర్, ఎడిఇ కె. రఘురాజన్, ఎఇ బి.వి.ఎస్.జి. కృష్ణ, ఎం&పి డిఇ రాజేశ్వరి, సబ్ ఇంజనీర్ అలేఖ్య, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్.శేషాద్రి, టిడిపి పట్టణ కార్యదర్శి తూతికరాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us