UPDATED 7th AUGUST 2019 WEDNESDAY 8:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) ప్రాంగణంలో గల గైట్ అటానమస్, గైట్ ఇంజనీరింగ్, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం బిటెక్ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు మాట్లాడుతూ విజయ సాధనకు ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని, నేటి పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సాధించేందుకు నిర్దిష్ట లక్ష్యాలు తప్పనిసరని అన్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించడంతోపాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, తల్లిదండ్రులు తరచూ కళాశాల అధ్యాపకులను సంప్రదించి వారి పిల్లల విద్యా పురోగతి తదితర విషయాలను తెలుసుకోవాలని సూచించారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్ట పిఎంఎంఎస్ శర్మ మాట్లాడుతూ లక్ష్య సాధనకు భావి ఇంజినీర్లు చేపట్టాల్సిన కార్యాచరణపై విలువైన సూచనలు చేశారు. ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కలిగిఉండాలని అన్నారు. అలాగే దేశ, విదేశాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కళాశాల పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, విజయశేఖరబాబు, డీన్ ఆర్.వి. కుసుమకుమారి, డైరెక్టర్లు డాక్టర్ పి.ఆర్.కె. రాజు, వంశీకిరణ్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







