UPDATED 29th JULY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో రాస్తారోకో నిర్వహించనున్నట్లు తెలిసి ఎమ్మార్పీఎస్ నాయకులను స్థానిక పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లూరి నాని మాదిగ, మండల నాయకుడు నందిక చక్రం, మందపల్లి వెంకన్న, డివిజన్ నాయకులు తాతపూడి కృష్ణబాబులను సోమవారం అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందా కృష్ణమాదిగ పిలుపునిచ్చిన నేపథ్యంలో నాయకులు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుమంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమార్పీఎస్ నాయకుడు వల్లూరి నాని మాదిగ మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెలు సాధించుకునేందుకు సామర్లకోట పట్టణంలో రాస్తారోకో, కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే తమను అణచివేసే విధంగా ప్రభుత్వం అరెస్టులు చేయడం దారుణమని పేర్కొన్నారు.







