UPDATED 30th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫోరెన్సిక్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు విశిష్ట అతిధిగా ప్రముఖ న్యాయవాది ఎన్. పట్టెన్న, ముఖ్య అతిధిగా రంగరాయ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్జ్వలన అనంతరం డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి విద్యాధినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేసి మాట్లాడారు. విద్యావ్యవస్థలో అత్యంత సున్నితమైన ప్రధానమైన రంగం ఫోరెన్సిక్ విద్య అని, దీనిని ఎంచుకొనడం అంటేనే నేరరహిత శాంతియుత సమాజస్థాపనకు మనవంతు సేవ అందిస్తూ దేశ శాంతిభద్రతలలో పాలుపంచుకోవడం వంటిదే అని అన్నారు. విశిష్ట అతిధి పట్టెన్న మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ఫోరెన్సిక్ పాత్ర అత్యంత కీలకమని, నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది న్యాయవ్యవస్థ ప్రధమ కర్తవ్యమని, ఎలాంటి తప్పు జరగకుండా సరైన నిర్ణయం తీసుకొనేందుకు ఫోరెన్సిక్ శాఖ ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. ముఖ్య అతిధి డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థులంతా తమ ఎంచుకొన్న మార్గంలో విజయం సాధించాలని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గత సంవత్సరంలో మంచి ప్రతిభ కనబర్చిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలను ఇచ్చి సత్కరించారు. ఆదిత్య యాజమాన్యం అతిధులను జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







