UPDATED 28th NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు బూత్ లెవెల్ అధికారులను హెచ్చరించారు. స్థానిక పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సామర్లకోట అర్బన్, రూరల్ కు సంబందించిన బూత్ లెవెల్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ఓటరు లిస్టులో అనుమానంగా ఉన్న ఓటర్లను గుర్తించి వారిని తొలగించే ఏర్పాటు చూడాలని, ఎలక్షన్ కమీషన్ ఓటరు లిస్టు విషయంలో తప్పు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. నొంతమంది బూత్ లెవెల్ అధికారులు ఓటరులిస్టు ప్రక్రియలో అలసత్వంగా ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని, వారు విధులలో సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని అన్నారు. అనంతరం బూత్ ల వారీగా ఆర్డీవో ఓటరులిస్టును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, సామర్లకోట తహసీల్దార్ ఎల్. శివకుమార్, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎలక్షన్ డిటిలు, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.







