UPDATED 18th APRIL 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో అపరాల పంటలను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇరవై శాతం మాత్రమే వరికోతలు జరిగాయని, ఈ నెలాఖరు నాటికి తొంభై శాతం వరికోతలు పూర్తి అవుతాయని తెలిపారు. వరికోతలు పూర్తి అయిన తరువాత మినుములు, పెసలు పిల్లి పెసర వంటి అపరాలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. రైతులకు 50 శాతం రాయితీపై అపరాలు సరఫరా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ సూచించే యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎస్. మాధవరావు, అగ్రికల్చర్ ఆఫీసర్ సి. భవాని, ఎవో ఎన్. శ్యామూల్ జాన్, తదితరులు పాల్గొన్నారు.







