UPDATED 9th AUGUST 2017 WEDNESDAY 2:00 PM
పెద్దాపురం: పట్టణ నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను పట్టణ శివారుకు తరలించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో దారపురెడ్డి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న సముదాయంలోని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించడం మంచి విషయమే అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో కాకుండా దూరంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నిర్మించడం పై ఆయన అభ్యంతరం తెలిపారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ కార్యాలయాలు నిర్మించిన కారణంగా నూతన భవనాలు అవసరం ఉందన్నారు. ఈ రెండు కార్యాలయాల ప్రాముఖ్యతను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్దాపురం, సామర్లకోట రహదారిలో మహారాణి కళాశాల వద్ద కాకుండా ప్రస్తుతం ఉన్న కార్యాలయాల స్థానంలోనే వీటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిరిపురపు శ్రీనివాస్, రొంగలి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.







