UPDATED 31st AUGUST 2017 THURSDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన డెల్ నెట్ ప్రతినిధులు హెచ్.కె. కౌల్, సంగీత్ కౌల్ ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. ఒకరోజు నిర్వహించే ఈ వర్క్ షాప్ లో "డెల్ నెట్ డిస్కవరీ సర్వీసెస్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వెర్స్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్, ప్లాగారిజమ్" అనే అంశాలపై నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత సంప్రదాయ గ్రంథాలయాలకు సాంకేతిక, వృత్తి విద్యా కళాశాలల గ్రంథాలయాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చెందిన గ్రంథాలయ పరిజ్ఞానాన్ని అందరికి అందించే విధంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా మరింత మెరుగైన విస్తృత సేవలను అందించగలిగే జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంధాలయశాఖోపాధ్యాయులకు ఇది ఒక చక్కని అవకాశమని అన్నారు. పలు ప్రాతాలనుంచి 200 మంది ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారని వారికి సర్టిఫికెట్లు, వర్క్ షాప్ కిట్లు అందిస్తామన్నారు. తమ కళాశాల ఈ వర్క్ షాప్ కు వేదిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్, గంధాలయాధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







