UPDATED 22 JANUARY 2022 SATURDAY 02:00 PM
చెన్నై (రెడ్ బీ న్యూస్) : జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి ముచ్చట కాస్త సంతోషంగా, కాస్త వైవిధ్యంగా జరగాలని యువత ఆరాటపడుతోంది. పెళ్లి మండపంలోకి వచ్చేప్పుడు పధూపరుల డ్యాన్సులు, బంధువుల ముందు భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడం, కానుకలు ఇచ్చుకోవడం ఆ తరహాలోనివే ఇటీవల కాలంలో ఈ పోకడ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా కూడా మారుతున్నాయి. ఇదే తరహాలో తమిళనాడులోని కడలూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె కూడా తన పెళ్లి వేడుకలో డ్యాన్సు చేసుకుంటూ మండపానికి వచ్చింది. కానీ అది కాస్తా వివాహం ఆగిపోవడానికి దారితీసింది. కడలూరులోని పశ్రుతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెకు కొద్ది రోజుల క్రితం ఎంగేజ్ మెంట్ జరిగింది. జనవరి 20న వివాహ తేదీని నిశ్చయించారు. దానికి ముందురోజు కొన్ని వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో పెళ్లి కుమార్తె. తన బంధువులతో కలిసి డ్యాన్సు చేసుకుంటూనే వేదిక వద్దకు వచ్చింది. ఆమె అలా రావడం పెళ్లి కుమారుడికి నచ్చలేదు. అలా ఎందుకు చేశావంటూ ఆమెను ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగి, ఇద్దరిమద్య గొడవకు దారితీసింది. కోపంతో విచక్షణ కోల్పోయిన వరుడు.. వధువు చెంప ఛెళ్లుమనిపించాడు. ఆ అమ్మాయి కూడా అతడి చెంప పగులకొట్టింది. ఈ గొడవంతా వధువు తండ్రి ఎదుటే జరిగింది. తన ముందే తన కూతుర్ని కొట్టడంతో ఆయన ఏ మాత్రం సహించలేకపోయాడు. ఇలాంటివాడు తనకు అల్లుడిగా పనికిరాడంటూ అబ్బాయి తరపు వాళ్లందరినీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పేశాడు. ఆ తర్వాత అక్కడే తన బంధువుల్లోని ఓ యువకుడితో పెళ్లి ఖాయం చేశాడు. ముందుగా నిశ్చయమైన తేదీకే దగ్గర్లోని గుడిలో వివాహం జరిపించాడు. ఈ వ్యవహారంపై పెళ్లి కొడుకు స్పందించాడు. ఎందుకు డ్యాన్స్ చేశావని ప్రశ్నించినందుకు వధువు తల్లిదండ్రులు, బంధువులంతా తనను దూషించారని, పెళ్లి రద్దు చేసుకున్నారని ఆరోపించాడు. పెళ్లి కోసం తాను పెట్టిన ఖర్చంతా ఇప్పించాలని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.







