UPDATED 25th JANUARY 2019 FRIDAY 9:00 PM
గండేపల్లి: ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం తెలుసుకోవడంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో విధిగా ఓటు వేయాలని ప్రముఖ గణితావధాని, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య గ్రంధాలయ, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ గణితావధాని, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథి సాయిరామకృష్ణ మాట్లాడుతూ ఓటు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కు అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం ఓ బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటు హక్కుకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 2011 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజల్లో ఓటుకున్న ప్రాధాన్యతను వివరించి ఓటు నమోదు చేయించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. విద్యార్థులు ఓటు హక్కుపై పూర్తి అవగాహన కలిగి ఉండి వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారిని సైతం ఓటు వేసేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు సాయిరామకృష్ణ చేతుల మీదుగా అవార్డులు అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిని ఆదిత్య యాజమాన్యం తరుపున జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శివకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీష్ సముద్రాల, గ్రంధాలయ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







