UPDATED 11th OCTOBER 2018 THURSDAY 7:00 PM
పెద్దాపురం: మారుతున్న చట్టాలను అనుగుణంగా మెలగాలని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ చిన్న తగాదాకు కోర్టును ఆశ్రయించి తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. పిల్లల మీద ఒత్తిడిని పెంచి వారిని మానసిక రోగులుగా మార్చవద్దని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రాంతీయ భాషలో అందరికీ అర్ధమయ్యే రీతిలో న్యాయ సలహాలను ఇవ్వడం, చట్టాలపై అవగాహన కల్పించడం కోసమే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని అన్నారు. సామాజిక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తమ పరిధిలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే సరిపోతుందన్నారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన పేదవారికి ఉచిత న్యాయ సహాయం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తామన్నారు. ఈ సదస్సులో జాతీయ న్యాయ సేవా చట్టం, లైంగిక వేధింపులు, బాల్య వివాహ చట్టం, గృహ హింస, మహిళా, తదితర చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల సూర్యవతీ శ్రీనివాస్, న్యాయవాదులు అత్తిలి ప్రభూజీ, రాగం కామేశ్వరావు, సకురు దుర్గారావు, కె. గణేష్, డి. శ్రీనివాస్, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.







