UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన గోదావరి సెయిలింగ్ యాత్ర-2018 శనివారం సామర్లకోటలో ముగిసింది. ఆంధ్ర నేవెల్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఐదున భద్రాచలంలో ప్రారంభమైన యాత్ర ఎయిర్ కమాండర్ ఎన్.ఎస్. రెడ్డి, ఎన్.సి.సి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో 42 మంది క్యాడెట్లు, ఇద్దరు నేవల్ ఆఫీసర్లు, 8 మంది నేవెల్ సెయిలర్లు, అసోసియేట్ ఎన్.సి.సి ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమై నెల్లిపాక, చింతూరు, పోచవరం, దేవీపట్నం, రాజమహేంద్రవరం, కేశవరం, బిక్కవోలు మీదుగా చివరకు సామర్లకోటలో ముగిసింది. సుమారు 410 కిలోమీటర్ల సాగిన ప్రయాణంలో పాల్గొన్న క్యాడెట్లు నేవీలో మెళుకువలు, నౌకాయానంలో కలిగే ఒడుదుడుకుల మీద అవగాహన ఏర్పరచుకున్నారు. నేవెల్ క్యాడెట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేర్వేరు ప్రదేశాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ మార్గమధ్యంలో నది ఒడ్డున గల ప్రాంతాలు, గిరిజనుల స్థావరాలు, వారి స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుసుకున్నారు. క్యాడెట్లు పాపికొండలు, శివుని గుడి, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ-తాటిపూడి ఎత్తిపోతల పథకం సందర్శించారు. చివరకు సామర్లకోట దక్కన్ సుగర్స్ ఫ్యాక్టరీ వద్ద ఎయిర్ కమాండర్ ఎన్.ఎన్. రెడ్డి, ఎన్.సి.సి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) యాత్రికులకు స్వాగతం పలికి ఈ సెయిలింగ్ యాత్రకు ముగిసినట్లు తెలిపారు. ఈ క్యాంపులో పాల్గొన్న క్యాడెట్లకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందచేశారు. ఈ సందర్భంగా ఎయిర్ కమాండర్ ఎన్.ఎన్. రెడ్డి మాట్లాడుతూ క్యాడెట్లు, కార్యనిర్వహణాధికారులు ఈ యాత్రను దిగ్విజయంగా ముగించినందుకు వారిని అభినందించారు. ఈ యాత్రలో కలిగిన అనుభవం వేరే క్యాంపులో కలగదని అన్నారు. నౌకాయానంలో ఉన్న మెళుకువలను నేర్పుతూ ఐక్యతతో పనిచేయు లక్షణాలను క్యాడెట్లకు నేర్పడం ఈ యాత్ర ముఖ్య ఉద్ద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి అధికారులు భువనేశ్వర్ బాబు, కె. రవీంద్రనాథ్, కె. చిరంజీవి, వై.ఎన్.వి.వి. రామారావు, సిహెచ్ కృష్ణారావు, శ్రీప్రకాష్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.







