* తహసీల్దార్ వజ్రపు జితేంద్ర
UPDATED 14th JUNE 2020 SUNDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కౌలు రైతులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సామర్లకోట తహసీల్దార్ వజ్రపు జితేంద్ర పేర్కొన్నారు. మండల పరిధిలోని అచ్చంపేట గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద పంటల సాగు పత్రం (సిసిఆర్సీ)పై రైతులకు ఆదివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిణి ఐ. సత్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ భూయజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పంటల సాగు పత్రంతో సాగుదారునికి భూమిపై ఎలాంటి హక్కులు లభించవని, పంట రుణం, పంట భీమా, సబ్సిడీ పథకాలు సాగుదారు పొందవచ్చని తెలిపారు. పంటల సాగు పత్రం కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే అని, 11 నెల తర్వాత మళ్లీ కొత్తగా కార్డు పొందవలసి ఉంటుందన్నారు. భూ యజమానులకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వారి ఆందోళనకు కారణం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ రక్షణ చట్టం-1956 రద్దు చేసిందని, సాగుదారు కార్డుపై సంతకం పెట్టడానికి భూయజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాగుదారు కార్డు ద్వారా సాగు దారు పంట రుణం తీసుకుని ఏ కారణం చేతనైనా కట్టలేకపోతే ఆ బాధ్యత యజమానిపై ఉండదని, ఋణం ఇచ్చిన బ్యాంకు భూమి పైకి రాకుండా చట్టంలో తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందన్నారు. 11 నెలల సమయం గడవకముందే భూయజమాని తమ భూమిని ఎవరికైనా అమ్ముకోవడానికి ఆటంకం లేదని, ఆ పంట కాలంలో పంటపై మాత్రం సాగుదారుకి హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఎం. కిరణ్, విఆర్వో వి. దుర్గ, విఏఏ ఎం.వి.వి. రమణ, సొసైటీ అధ్యక్షులు వీరంరెడ్డి వెంకయ్య, గ్రామ పెద్దలు వీరంరెడ్డి వసంత రాయుడు, మాజీ ఎంపీటీసీ వీరంరెడ్డి చిన్నబాబు, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.







