UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య, భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించిన ఛాత్ర విశ్వకర్మ రీజనల్ కన్వెన్షన్ అవార్డుల ప్రాజెక్ట్ ఎక్స్ పోలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 83 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులతో పోటీపడి వాటర్&ఇరిగేషన్ విభాగంలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) ప్రధమస్థానం, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల ఎడ్యుకేషన్ విభాగంలో ద్వితీయస్థానం, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్&ఫుడ్ విభాగంలో తృతీయస్థానం కైవసం చేసుకున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. వాటర్ ఇరిగేషన్ పై రూపొందించిన ప్రాజెక్టుకు ఎస్.ఎన్.ఎస్.ఎల్. గాయత్రి హరిప్రియ, వై. శ్రావణి, వి. దీవెన, ఇ. నిధిశ్రీ అండ్ టీమ్ కు ప్రధమ బహుమతి వచ్చిందని, ఈ టీమ్ కు మెంటారుగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. విధేయరాజు సహకారం అందించారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల విధానంలో విద్యుత్ వినియోగం తగ్గించడం, సక్రమమైన నీటి వినియోగం, తదితర అంశాలలో ఎంతో ఉపయోగమైన ఆలోచనా విధానంతో కేవలం రూ.2500/- ఖర్చుతో ఈ ప్రాజెక్టు రూపొందించడం జరిగిందని గాయత్రి తెలిపారు. రైతులకు ఎంతో మేలుచేసే ఈ విధానంలో పొలాలకు అవసరమైన నీటి వినియోగం చేసుకొనేలా పరిస్థితులకు అనుగుణంగా నీటిని పొలాలకు అందిస్తూ రైతు మొబైల్ కు సందేశాన్ని ఇచ్చే విధంగా రూపొందించడం జరిగిందని విద్యార్థులు వివరించారు. రైతులకు మరింత చేరువ అయ్యే విధంగా కేవలం రూ.1000/-ఖర్చుతో ఈ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టం అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు సి.హెచ్. హారిక, సతీష్ కుమార్, పి. రచన, కె. స్వర్ణాంబికలతో కూడిన టీమ్ సభ్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్. శైలజ టీమ్ మెంటర్ సహకారంతో గ్రామీణ విద్యాభివృద్ధికి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవలసిన చర్యలు, మౌలిక వసతుల కల్పనలు గురించి రూపొందించిన ప్రాజెక్టుకు ఎడ్యుకేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారని, అలాగే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆదిత్య శశాంక్, సూర్యప్రకాష్, కె. మహేష్, శివకుమార్ తో కూడిన బృందం అసిస్టెంట్ ప్రొఫెసర్ టి. రామాంజనేయులు మెంటర్ సహకారంతో రేషన్ మేనేజ్ మెంట్ డిజిటైజేషన్ సిస్టంపై సమర్పించిన ప్రాజెక్టు అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ప్రాజక్టులు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఛాత్ర విశ్వకర్మ అవార్డులలో పోటీపడేందుకు అర్హత సాధించాయని తెలిపారు. తమ విద్యార్థులు న్యూఢిల్లీలో కూడా ప్రతిభ కనబరిచి ప్రధమస్థానంలో నిలవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ చదువు సమాజానికి ఉపయోగపడేలా ముఖ్యంగా రైతులకు సహకారం అందించే విధంగా ఏదైనా రూపొందించాలని దృక్పధంతో మెంటార్స్ సహకారంతో ఈ ప్రాజెక్టులు రూపొందించామని, ఆదిత్య యాజమాన్యం, ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, విభాగాధిపతులు సహకారంతో ఈ ఫలితాలు సాధించామని అన్నారు.







