* లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైనా .. పదివేలేనట!
* ఆర్డీవోకు తహసీల్దార్ తప్పుడు నివేదికలు
* పీజీఆర్ఎస్ దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుడుకి ఝలక్
* క్షేత్రస్థాయిలో పరిశీలన నిల్
* తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ, సీఎస్ లకు ఫిర్యాదు
UPDATED 23 JANUARY 2026 FRIDAY 3:20 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జనవరి 23 : మట్టి ఆక్రమ తవ్వకందార్లకు రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది నిజం చేస్తూ పెద్దాపురం, వాలుతిమ్మాపురం వరిధిలో సర్వే నంబర్ 28లో సుమారు 48 ఎకరాల్లో విస్తరించి ఉన్న పంగిడి చెరువులో జరిగిన అక్రమ తవ్వకాలపై ఇచ్చిన తప్పుడు నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది జూలై నెలలో నవకాన్ ఇన్ ఫ్రా (Navkon infra) పేరుతో పంగిడి చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సాగాయి.. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో స్థానిక రెవెన్యూ అధికారులు హడావుడి చేసి తవ్వకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు టచ్ ఇచ్చారు. కొన్ని గంటలు తిరక్కుండానే మళ్లీ మట్టి ఆక్రమ తవ్వంకందార్లు ఏడాపెడా మట్టిని తవ్వేసి ఇబ్బడిమబ్బడిగా తరలించేసి రూ. లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.
అక్రమ తవ్వకాలే జరగలేదని తప్పుడు నివేదికలు..
పంగిడి చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై స్థానిక సామాజిక కార్యకర్త, ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ ఛైర్మన్ గుణ్ణం లక్ష్మణరావు ఆర్డీవోకు పీజీఆర్ఎస్ (PGRS) లో గత ఏడాది జూలై 23న ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయకుండానే గ్రామ రెవెన్యూ అధికారి (Village Revenue Officer), రెవెన్యూ ఇనస్పెక్టర్ (Revenue inspector)లు ఇచ్చిన నివేదికలు ఆధారంగా వాటిని ధృవీకరిస్తూ ఆర్డీవోకు నివేదికలను పంపించేశారు. పైగా అక్రమ తవ్వకాలే జరగలేదని నిబంధనల ప్రకారమే కేవలం 10 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే తవ్వకాలు జరిగాయని, పొలం మెరక చేసుకునేందుకు రైతు దరఖాస్తు చేసుకున్నాడని నిర్ధారిస్తూ కట్టు కథ అల్లి తప్పుడు నివేదికలను సమర్పించేశారు. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి కళ్ళ ఎదురుగా తరలిపోయినా వారికి కనిపించక పోవడం చూస్తుంటే అధికారులు పరిశీలన ఏవిధంగా చేశారో తెలుస్తోంది. పైగా ఎలాంటి సర్వే నిర్వహించకుండా ఖచ్చితంగా 10 వేల క్యూబిక్ మీటర్లే తవ్వకాలు జరిగాయని ఏవిధంగా నిర్ధారించారో వారికే తెలియాలి.
తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..
పంగడి చెరువు అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించిన పెద్దాపురం తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని సదరు సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్ (District Collector), సీసీఎల్ఏ (CCLA), సీఎస్ (CS)లకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారుల్లో వణుకు మొదలయ్యింది. ఇప్పుడు జిల్లాస్థాయి అధికారి ఈ అక్రమ తవ్వకాలపై విచారణ చేస్తే పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. దీంతో తమను ఎలా అయినా ఈసమస్య నుంచి గట్టెక్కించాలని అధికార పార్టీ నాయకుల వద్ద సంబంధిత అధికారులు సాగిలపడినట్టు సమాచారం.







