UPDATED 2nd MAY 2018 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం : రైతుల సంక్షేమంతోనే దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని, అందువల్లే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము) అన్నారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో ఎడిఎ ఎం. రత్నప్రశాంతి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కిసాన్ కల్యాణ్ కార్యశాల (రైతు పురోభివృద్ధికి అవగాహన సదస్సు) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు కనీసమద్దతు ధర కల్పించాలనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నందున అన్నదాతలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి అండగా నిలుస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రెండు లక్షల మిలియన్ల హెక్టార్ల భూమి సాగవుతుంటే అందులో సగం పంటకు బీమా కల్పించి రైతులను ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు పంటల బీమా ఓ వరం అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలకు ఏటా నిధులు కేటాయిస్తోందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాన కార్యాచరణన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులు పంటల సాగులో వచ్చే మార్పులను అనుసరించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే సలహాలు, సూచనలు పాటించి ఆధునిక పద్ధతులు పాటించి లాభసాటి వ్యవసాయం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ శిక్షణా కేంద్రం డిడి ఓలేటి బోసుబాబు మాట్లాడుతూ పంటల సాగులో మేలైన వంగడాలు ఎంపిక చేసుకుని, పెట్టుబడి ఖర్చు తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించినపుడు గిట్టుబాటుగా మారుతుందన్నారు. మేలైన విత్తనాలను అనుమతి ఉన్న దుకాణాల్లో కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పర్యావరణం, మానవాళికి హానికరమైన విత్తనాలు విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు భూసార పరీక్షలను అనుసరించి రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చునన్నారు. ఈ సందర్భంగా పంటల సాగులో మంచి ఫలితాలు సాధించిన పెద్దాపురం, కిర్లంపూడి, రంగంపేట, మండలాలకు చెందిన రైతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం ఎడిఎ జి. మల్లిఖార్జునరావు, హార్టికల్చర్ ఎడి గోపీకుమార్, ఉద్యానశాఖాధికారి టి.వి.సిరిల్, వెటర్నరీ ఎడి అంబేద్కర్, ఏవో కొల్లి ద్వారకాదేవి, వెటర్నరీ అధికారి డాక్టర్ రాకేష్, మైక్రో ఇరిగేషన్ ఏరియా ఇంచార్జ్ ఎం. చిలకమ్మ, ఏఈవో ఎన్.వి.వి.ప్రసాద్, ఎంపీఈవోలు కుమార్, షేక్ బాలాజీ, ఆత్మా ఏటీఎంలు నాగబాబు, అనురాధ, రైతులు ఎండ్రు రామారావు, పుట్టా సోమన్నచౌదరి, తదితరులు పాల్గొన్నారు.







