ప్రతీ నీటిబొట్టును కాపాడుకుందాం

UPDATED 14th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రతీ నీటిబొట్టును కాపాడుకుంటూ ప్రజలకు వినియోగించే విధంగా అన్ని విధాల చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక పంచారామ క్షేత్రమైన  కుమారారామ భీమేశ్వరస్వామి దేవాలయం సమీపాన గల గోదావరి పుష్కరిణి వద్ద శుక్రవారం నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాతో కలిసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో త్రాగునీరు, సాగునీరు కొరత లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలకు నీరందించేందుకు తలపెట్టిన ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు ప్రాజెక్టులు నిర్మించేందుకు ఎత్తిపోతల పథకాలకు, నదుల అనుసంధానానికి ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జలహారతి కార్యక్రమం సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని ముఖ్య నదులు, కాలువల వద్ద  జలహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరికొన్ని ప్రాజెక్టుల పనులు శరవేగంగా  జరుగుతున్నాయని అన్నారు. నదులు అనుసంధానం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుసీమలాంటి ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నది నుంచి కృష్ణానది వరకు పూర్తిస్థాయిలో నీరందించడం వలన రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నామని, అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తయిందని, దీని ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఆయా ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించడమే కాకుండా విశాఖపట్నం జిల్లాకు కూడ ఈ పథకం ద్వారా నీరు అందించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా జలవనరుల శాఖ ఎస్ఇ నల్లం కృష్ణారావు, ఇఇ ఆర్.మోహనరావు, సమాచార శాఖ డిడి ఎం. ఫ్రాన్సిస్, మాజీ ఎంఎల్ సి కె.వి.వి. సత్యనారాయణరాజు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కంటే బాబూరావు, జెడ్పీటీసి గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి,  కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, అడబాల చిట్టిబాబు, జి.  సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us