* రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
UPDATED 26th JULY 2020 SUNDAY 7:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కోవిడ్ కేసులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక రమణయ్య పేటలో తన క్యాంప్ కార్యాలయంలో విలేఖరులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ కేసులు గుర్తించిన వారిని స్పెషల్ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచడంతో పాటు హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రభుత్వపరంగా తగిన సేవలు అందిస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకోవడంతో పాటు వారు సొంత ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, 104, 108 వాహనాల ద్వారా విలువైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ ఇన్పెక్షన్ 5.56 శాతం, రికవరీ 48.78 శాతం, మరణాలు 1.17 శాతంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు పడాల్సిన అవసరం లేదని, ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనాను తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. నిమ్మ ధరలు పడిపోయినందున ప్రభుత్వపరంగా వాటిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నామని అలాగే ఆక్వా కల్చర్ లో వస్తున్న ధరలను సమీక్షించి ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని పనిచేసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.147 నియోజకవర్గాల్లో ఇంటి గ్రేటేడ్ వ్యవసాయ లాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని, 13 జిల్లా కేంద్రాల్లో జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ లాబ్స్ తో పాటు నాలుగు రీజినల్ లాబ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, తిరుపతిలో 175 కోట్ల రూపాయలు ఖర్చుతో వీటిని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం
జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా మంత్రి కన్నబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.







