UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ మట్టపల్లి లక్ష్మీ భ్రమరాంబ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒంటరి మహిళ పింఛన్లు అమల్లోకి వచ్చి మూడు నెలలు గడుస్తోందని, గ్రామాల్లో ఈ పథకం అమలవుతున్నా మున్సిపాలిటీలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. దీనిని మున్సిపల్ కమీషనర్ సమాధానమిస్తూ వచ్చే నెలలో పింఛన్లు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో అనధికారికంగా నిర్మిస్తున్న సెల్ టవర్ అంశంపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు టౌన్ ప్లానింగ్ అధికారులపై ధ్వజమెత్తారు. సెల్ టవర్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. సెల్ టవర్ నిర్మాణం అడ్డుకోవడంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలమయ్యారని, అలాగే పట్టణంలో అనధికారికంగా కట్టడాలు నిర్మిస్తున్నాఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారి రత్నబాబు చెప్పిన సమాధానానికి కౌన్సిలర్లు సంతృప్తి చెందకపోవడంతో సుమారు ఇరవై నిమిషాలు వాగ్వివాదం చోటుచేసుకుంది. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా డ్రైనేజీల్లో పూడికతీత వంటి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని, దీని వలన ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని కాళ్ల లక్ష్మీనారాయణ అన్నారు. ఆరో వార్డు కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్ మాట్లాడుతూ పట్టణంలో ఎస్సీ కల్యాణ మండపం నిర్మాణానికి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే వార్డులో కుక్కల బెడద అధికంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, మన్యం చందర్రావు, శెట్టిబత్తుల రాజారావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..







