ఇంజనీరింగ్ అధికారుల తీరు ఇదేనా....

* మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తీరుపై కౌన్సిల్ సభ్యులు ఫైర్ .. 
* ప్రతీ చిన్న విషయానికి చైర్మన్ అనుమతి కావాలా అంటూ ధ్వజం..
* వాడీ వేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

UPDATED 31st JANUARY 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గురువారం వాడీ వేడిగా జరిగింది.  మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పనుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం పట్ల కౌన్సిల్ సభ్యులు ఫైర్ అయ్యారు. ఇంజనీరింగ్ అధికారులు పనితీరు మార్చుకోవాలని లేకపోతే మా పని మేము  చేసుకుంటామని, ప్రతీ చిన్న విషయాన్ని చైర్మన్ కు చెప్పి చేయాలా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. పదవ వార్డు కౌన్సిలర్ త్సలికి సత్య భాస్కరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం సమీపంలో పైపులైను లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గోకిన ప్రభాకరరావు మాట్లాడుతూ డ్రైనేజీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పినా ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ చిన్నవిషయాన్ని మున్సిపల్ చైర్మన్ కు చెప్పి చేయాలా ఇంక మేమెందుకు అని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18వ వార్డు కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ మాట్లాడుతూ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు నిరుపయోగంగా ఉంటోందని ఆమె కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. 16వ వార్డు కౌన్సిలర్ తాళాబత్తుల ఉదయకామేశ్వరి మాట్లాడుతూ తన వార్డులో డ్రైనేజీ పగలడంతో ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 22వ వార్డు కౌన్సిలర్ వాసంశెట్టి గంగ మాట్లాడుతూ రాయభూపాలపట్నం వెళ్లే రహదారిలో నకిలీ పట్టాలు, పోజిషన్ పట్టాలతో విలువైన మున్సిపల్ స్థలాలను కొంతమంది కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏడవ వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు విస్తరణ కారణంగా అంతర్గత రోడ్ల గుండా భారీ వాహనాలు వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ను నియమించాలన్నారు. అనంతరం సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ బీఆర్ శేషాద్రి, టీపీవో భాస్కరరావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us