* వేళలు పాటించని అధికారులు
* సాకులు వెతుకుతూ విధులకు డుమ్మా
* కార్యాలయాల్లో ప్రజలు పడిగాపులు
* అధికారుల తీరుతో ప్రజల దరిచేరని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
UPDATED 7th DECEMBER 2019 SATURDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ ఉద్యోగుల్లో అంకితభావం నానాటికీ కరువవుతోంది. విధులకు డుమ్మా కొడుతూ జీతాలు మాత్రం టంచన్ గా ఒకటవ తేదీకి అందుకుంటున్నారు. పెద్దాపురం పట్టణ, మండల గ్రామాల్లో పనిచేసే కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారశైలే ఇందుకు నిదర్శనం.
ఉద్యోగం చేసే చోటే నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఉద్యోగులు భేఖాతర్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు ఇక్కడ చేస్తూ నివాసాలు జిల్లా కేంద్రంలో వెలగబెడుతూ మరికొందరు ఎగనామం పెడుతున్నారు. లేదంటే సమయం దాటాక కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఇదే అదునుగా క్రిందిస్థాయి సిబ్బంది కూడా సకాలంలో విధులకు హాజరుకావడం లేదని, దీంతో సమయానికి జరగాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు పలు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఒక్కోరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీంతో పలు పనులపై మండల కేంద్రానికి వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది.
క్రిందిస్థాయి సిబ్బంది కవరింగ్
మండలస్థాయి అధికారులు కార్యాలయంలో కనిపించని పక్షంలో క్రిందిస్థాయి సిబ్బంది కవర్ చేస్తూ ఉంటారు. 'అయ్యగారు ఈ రోజు మీటింగుకు వెళ్లారు.. అమ్మగారేమో క్యాంపునకు వెళ్లారు' అంటూ ఆయా శాఖలలో క్రిందిస్థాయి సిబ్బంది తమతమ అధికారులను కాపాడుతుంటారు. సమయానికి విధులకు హాజరుకాని ఉద్యోగుల పట్ల ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ప్రజలకు చేరక ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.







