అన్నార్తుల కడుపుకొడతారా?

* పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 
* అన్న క్యాంటీన్ల మూసివేతపై టిడిపి నాయకులు ధర్నా 

UPDATED 16th AUGUST 2019 FRIDAY 7:00 PM

పెద్దాపురం: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడంపై టిడిపి నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక మున్సిపల్ సెంటరు వద్ద గల అన్న క్యాంటీన్‌ భవనం ఎదుట ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, కార్మికుల, కూలీలు ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలో రోజుకు అనేక మంది పేదలు మూడుపూటలా కేవలం ఐదు రూపాయలకే  కడుపు నింపుకొనేవారని, అలాగే ఒక్కో క్యాంటీిన్‌లో కార్మికులు ఉపాధి పొందేవారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లను మూసివేశారని, క్యాంటీన్లు మూసివేసి రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు, కూలీలు, కార్మికుల కడుపుకొట్టారని అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని మూసివేయడం దారుణమన్నారు. తక్కువ ధరకే ఆహార పదార్థాలు అందుబాటులో ఉండటం వల్ల కార్మికులు, కూలీలు ఆకలి తీర్చుకుంటుంటే చూసి ఓర్వలేక చంద్రబాబుపై ఉన్న కక్షతో వాటిని మూసివేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని, రద్దుల ప్రభుత్వంగా జగన్‌ సర్కార్‌ పేరు తెచ్చుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం సుమారు 500 మందికి ఎమ్మెల్యే  భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ, రూరల్ అధ్యక్షులు రంధి సత్యనారాయణ, కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ ఆచంట రాజన్న, మన్యం దేవబాబు, త్సలికి సత్య భాస్కరరావు, తూతిక రాజు, మెయిళ్ల కృష్ణమూర్తి, పచ్చిపాల సత్తిబాబు, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.           

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us